వ్యాక్సిన్‌ కోసం మోదీ ముందు ధర్నా చేయండి: పొన్నం

6 May, 2021 11:16 IST|Sakshi

 బీజేపీ నేతలకు పొన్నం హితవు

సాక్షి, హైదరాబాద్‌: పక్క రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతున్నాయంటూ దీక్షలు చేయడంకాదని, తెలంగాణలోని ఆరోగ్య పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ హితవు పలికారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఘర్షణలు జరిగాయని ఇక్కడ దీక్షలు చేస్తున్న బీజేపీ నేతలు కరోనా వ్యాక్సిన్‌ లేదని, రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు లేవని మోదీ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే ఆందోళనలు చేయడం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనని, నిజంగా బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పొన్నం డిమాండ్‌ చేశారు.  

తెలంగాణకు దౌర్భాగ్యస్థితి పట్టింది: భట్టి
సాక్షి, హైదరాబాద్‌: కరోనాతో రాష్ట్రం అతలాకుతమవుతున్న వేళ చిల్లర రాజకీయాలు చేస్తున్న టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌ కారణంగా తెలంగాణకు దౌర్భా గ్యస్థితి పట్టిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్ర మార్క విమర్శించారు. ఇలాంటి సీఎం నాడు ప్రధా ని అయి ఉంటే పోలియో దెబ్బకు దేశంలోని సగంమంది అంగవైకల్యంతో బాధపడాల్సి వచ్చేదని ఎద్దేవా చేశారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరారు. బుధవారం సీఎల్పీ కార్యాలయం నుంచి ఆయన జూమ్‌యాప్‌ ద్వారా కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య  హాజరై కరోనా పరిస్థితులపై చర్చించారు.

అనంతరం జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా మొదటిదశ సమయంలోనే ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులు నిర్ధారించాలని కోరామన్నారు.అప్పుడు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు జనాన్ని జలగల్లా పీల్చుకుతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఇప్పు డు ఇంజక్షన్లుంటే ఆక్సిజన్‌ ఉండదు.. ఆక్సిజన్‌ ఉంటే బెడ్లు ఉండవు.. వెంటిలేటర్లుంటే టెక్నీషియ న్లు లేరు.. వ్యాక్సిన్లు లేవు.. ఆరోగ్య శాఖకు మంత్రి కూడా లేరు.. అని అన్నారు. కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఏమైందని భట్టి ప్రశ్నించారు.

కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలి: జగ్గారెడ్డి 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు అధికారులు చెబుతున్నారో లేదోననే అనుమానం తమకుందని, అందుకే నేరుగా ఆయనతోనే మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి కోరారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజలు ఆక్సిజన్‌ లేక చనిపోతున్నారని, సీటీ స్కాన్‌ యంత్రాలు పనిచేయడం లేదని, ఉన్నా అవి పనిచేయడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని కోరారు. ప్రస్తుత తరుణంలో రాజకీయ విమర్శలు ముఖ్యం కాదని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమో...భూముల పంచాయితీలు ముఖ్యమో తేల్చుకోవాలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు