నిజం గెలిచి కాదు.. కంటి ఆపరేషన్‌కే బెయిల్‌ | Ambati Rambabu Reacts On TDP Leaders Celebrations Over Chandrababu Getting Temporary Bail Skill Scam Case - Sakshi
Sakshi News home page

నిజం గెలిచి కాదు.. కంటి ఆపరేషన్‌కే బెయిల్‌

Published Wed, Nov 1 2023 3:43 AM

TDP leaders celebrating is ridiculous says Ambati  - Sakshi

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): చంద్రబాబుకు కంటి ఆపరేషన్‌ కోసం హైకోర్టు నాలుగు వారాల పాటు తాత్కాలిక బెయిల్‌ ఇస్తే.. టీడీపీ నేతలు న్యాయం గెలిచిందంటూ హంగామా చేయటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర జలవన­రుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిజం, సత్యం, ధర్మం గెలిచి చంద్రబాబు బయటకు రాలేదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్‌ ఎందుకు ఇచ్చారనే విషయాన్ని హై­కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.

చంద్రబాబు గతంలో ఒక కంటికి ఆపరేషన్‌ చేయించుకున్నారని.. మరో కంటికి కూడా ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెప్పడంతో మానవతా దృక్పథంతో కోర్టు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చిందని వివరించారు. అందువల్ల చంద్రబాబు ఆపరేషన్‌ చేయించుకొని.. 4 వారాల తర్వాత మళ్లీ జైలులో సరెండర్‌ కావా­ల్సిందేనన్నారు. శరీరంపై దురదలు వస్తున్నాయంటే ఏసీబీ కోర్టు మొన్న ఏసీ ఏర్పాటు చేయమన్నదని.. ఇప్పుడు జైలులో కంటి ఆపరేషన్‌ చేయలేరు కనుక హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చిందన్నారు. అంతేగానీ ఏదో సత్యం, ధర్మం, న్యాయం గెలిచి.. చంద్రబాబు బయటకు రాలేదన్నారు.

ప్రస్తుతం చంద్రబాబుపై కేసు విచారణలో ఉందని.. ఇప్పటికే కొందరు సహ నిందితులను ఆయన విదేశా­లకు పంపించారని.. వారిని కూడా విచారించాల్సిన అవసరముందన్నారు. చంద్ర­బాబుకు తాత్కాలిక బెయిల్‌ వస్తే.. లోకేశ్‌ యుద్ధం మొదలైందని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు యుద్ధం మొదలైతే మరి ఎర్ర డైరీ పట్టుకుని ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికినప్పుడు, ఏం పీకారంటూ సవాల్‌ విసిరినప్పుడు ఏం మొదలైందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయంఅయ్యింది
ఎక్కడైతే ఎన్టీఆర్‌ టీడీపీని ప్రారంభించారో.. అక్కడే టీడీపీ జెండాను చంద్ర­బాబు పీకేశారన్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం మూతపడిందని.. అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానేశ్వ­ర్‌కు జ్ఞానోదయమై రాజీనామా చేశారని చెప్పారు. జ్ఞానేశ్వర్‌ను పార్టీ అధ్య­క్షుడిగా పెట్టి, ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టించి, బీసీలకు పట్టం కడతామని పెద్దపెద్ద ఉపన్యాసాలిచ్చి.. చివరకు చంద్రబాబు, లోకేశ్‌ కలిసి తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని అన్నారు.

ఇతర పార్టీల గెలుపు కోసం టీడీపీని తాకట్టు పెట్టారని జ్ఞానేశ్వర్‌ స్పష్టంగా చెప్పారంటే.. టీడీపీ దుస్థితేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏపీలో కూడా ఎన్నికల ముందో, ఆ తర్వాతో టీడీపీ జెండా పీకేయటం ఖాయమ­న్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లోకేశ్‌ ఎత్తలేదంటే.. ఆయన సంస్కారమేంటో, పార్టీ పట్ల నిబద్ధతేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. సమావేశంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నా­రు. 

Advertisement
Advertisement