Sakshi News home page

ప్రజాభిప్రాయం.. సామాజిక న్యాయం 

Published Fri, Jan 12 2024 5:41 AM

YSR Congress Party Released Third Constituency Incharges List - Sakshi

సాక్షి, అమరావతి: జన బలమే గీటు రాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ.. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. యువతకు ప్రాధాన్యమిస్తూ 15 శాసనసభ స్థానాలకు, 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడో జాబితాను ఖరారు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌లో గురువారం రాత్రి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆ వివరాలను ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు.. ఈ నెల 2న 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేశారు.

మొత్తం మూడు జాబితాల్లో కలిపి 50 శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తల­ను ప్రకటించారు. గత ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి పెట్టగా, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని సమన్వయకర్తగా నియమించారు. శ్రీకాకుళం లోక్‌సభ సమన్వయకర్తగా పేరాడ తిలక్‌(బీసీ)ను నియమించారు. మంత్రి గుమ్మనూరి జయరాం(బీసీ)ను కర్నూలు లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్‌సభ స్థానం(ఎస్సీ) సమన్వయకర్తగా, విజయవాడ లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా కేశినేని నానిలను నియమించారు.  

బీసీలు, మహిళలు, మైనార్టీలకు పెద్దపీట  
మూడు జాబితాల్లో 50 శాసనసభ స్థానాల సమన్వయకర్తలను పరిశీలిస్తే.. సామాజిక న్యాయానికి సీఎం జగన్‌ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో అగ్ర వర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీ పెట్టిన ఏడు శాసనసభ స్థానాల్లో ఇప్పుడు ఐదు స్థానాల్లో బీసీ, రెండు స్థానాల్లో మైనార్టీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించారు. ఆరు శాసనసభ స్థానాలకు మహిళలను, 18 స్థానాల్లో యువతను సమన్వయకర్తలుగా నియమించారు.  మొత్తమ్మీద 50 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో.. ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనార్టీలు 4, ఇతర వర్గాలు 13 (రెడ్డి, కాపు, వైశ్య) మంది ఉన్నారు.

ఇప్పటి వరకు ప్రకటించిన 9 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. బీసీలు 6, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ ఉన్నారు. పెడన శాసనసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùను పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా, ఎమ్మెల్సీ మేరిగ మురళిని గూడూరుకు, , ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలికి  సమన్వయకర్తలుగా  నియమించారు. ఏపీఐఐసీ ౖచైర్మన్, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని రాయదుర్గం, మాజీ ఎమ్మెల్యే మూతిరేవుల సునీల్‌కుమార్‌ను పూతలపట్టు, ఆర్టీసీ రీజినల్‌ ఛైర్మన్‌ విజయానందరెడ్డిని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.  


జెడ్పీ చైర్మన్‌లకు అవకాశం  
శ్రీకాకుళం  జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియ విజయను ఇచ్చాపురం శాసనసభ స్థానం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా సీఎం జగన్‌ నియమించారు. ఇచ్చాపురం జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జెడ్పీ  చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్సార్‌ జిల్లా జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిని రాజంపేట సమన్వయకర్తగా, చిప్పగిరి జెడ్పీటీసీ బూసినే విరూపాక్షిని ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.  

క్లీన్‌ స్వీప్‌ లక్ష్యం  
సీఎం వైఎస్‌ జగన్‌ గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూ.2.45 లక్షల కోట్లు.. నాన్‌ డీబీటీ రూపంలో రూ.1.67 లక్షల కోట్లు.. వెరసి రూ.4.12 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందితే.. అందులో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండటం గమనార్హం. గత 56 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల రాష్ట్రంలో ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది.

ఆ మార్పు ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కళ్లెదుట కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ మార్గనిర్దేశం చేశారు. ప్రతి ఇంటా చేసిన మంచిని ప్రజలకు చెప్పి.. జనంతో మమేకమవుతూ సమస్యలు పరిష్కరించడం ద్వారా వారి మనసులు చూరగొని.. మరింత మంచి చేయడానికి ప్రజల ఆశీస్సులు కోరాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు మార్గ నిర్దేశం చేస్తూ వచ్చారు. ప్రజలతో మమేకం కాకుండా.. జనం మనసులు చూరగొనలేని వారికి టికెట్లు ఇవ్వలేనని ఆది నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ తేల్చిచెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అవసరమైన స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నారు.    

Advertisement

What’s your opinion

Advertisement