Sakshi News home page

హీట్స్‌లోనే జ్యోతి నిష్క్రమణ 

Published Wed, Aug 23 2023 2:54 AM

Jyoti exit in the heats itself - Sakshi

బుడాపెస్ట్‌ (హంగేరి): తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌  లో పోటీపడ్డ భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీ ఒత్తిడికిలోనై  నిరాశపరిచింది. మంగళవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి హీట్స్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది.

ఇటీవల ఆసియా చాంపియన్‌షిప్‌  లో స్వర్ణ పతకం సాధించిన జ్యోతి ప్రపంచ చాంపియన్‌షిప్‌  లో మాత్రం ఓవరాల్‌గా 29వ స్థానంలో నిలిచి సెమీఫైనల్‌ దశకు అర్హత పొందలేకపోయింది. నాలుగో హీట్‌లో పోటీపడ్డ జ్యోతి 13.05 సెకన్లలో గమ్యానికి చేరి ఏడో ర్యాంక్‌ లో నిలిచింది. మొత్తం ఐదు హీట్స్‌ జరగ్గా... ఒక్కో హీట్‌లో టాప్‌–4లో నిలిచిన వారు నేరుగా సెమీఫైనల్‌కు చేరారు

. మిగిలిన వారిలో బెస్ట్‌–4 టైమింగ్‌ నమోదు చేసిన అథ్లెట్‌లు కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. జ్యోతి తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (12.78 సెకన్లు) సమయాన్ని ఇక్కడ పునరావృతం చేసి ఉంటే ఆమెకు సెమీఫైనల్‌ బెర్త్‌ కచి్చతంగా ఖరారయ్యేది. ఎందుకంటే ఇక్కడ 12.92 సెకన్ల సమయం నమోదు చేసిన మేకీ జిన్లిమ్‌ (నెదర్లాండ్స్‌)కు చివరిదైన 24వ సెమీఫైనల్‌ బెర్త్‌ లభించింది.  

‘సూపర్‌’ షకేరీ... 
మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో కొత్త ప్రపంచ చాంపియన్‌ అవతరించింది. ఫైనల్లో అమెరికాకు చెందిన 23 ఏళ్ల షకేరీ రిచర్డ్సన్‌ 10.65 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌  లో పాల్గొన్న తొలిసారే షకేరీ స్వర్ణ పతకం సాధించడం విశేషం. షకేరీ ధాటికి ఐదుసార్లు 100 మీటర్ల వరల్డ్‌ చాంపియన్‌ షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ (జమైకా; 10.77 సెకన్లు) మూడో స్థానానికి పరిమితమై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

Advertisement

What’s your opinion

Advertisement