Sakshi News home page

ప్రశ్నార్థకంగా కందికుంట భవితవ్యం!

Published Fri, Dec 1 2023 12:56 AM

కందికుంట 
వెంకట ప్రసాద్‌  - Sakshi

కదిరి: టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నకిలీ డీడీల కుంభకోణం కేసులో ఇరు వర్గాల వాదోప వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలోని న్యాయమూర్తుల బెంచ్‌ రెండు నెలల క్రితమే తీర్పు రిజర్వ్‌ చేసింది. నేడు (శుక్రవారం) లేదంటే ఈనెల 8న దాన్ని వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే జైలు శిక్ష తప్పదని భావిస్నున్న కందికుంటతో పాటు ఆయన వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే కందికుంట రాజకీయ భవితవ్యానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని ఆ పార్టీకే చెందిన కొందరు నేతలు చెబుతున్నారు.

ఇంతకీ కేసు ఏమిటంటే..

స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా హుస్సేనీ ఆలం (హైదరాబాద్‌) బ్రాంచ్‌లో 2003లో నకిలీ డీడీల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2007లో అప్పటి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేయగా, నాంపల్లిలోని సీబీఐ కోర్టు అప్పట్లో కందికుంట వెంకటప్రసాద్‌కు రూ.3 లక్షల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు సంబంధించి రూ. 8.29 కోట్లు విలువ చేసే మరో నకిలీ డీడీల ఫోర్జరీ కుంభకోణం కేసులోనూ సీబీఐ కోర్టు కందికుంటకు రూ.13 లక్షల జరిమానాతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2016 మే 31న ఈ తీర్పును వెలువరించింది. దీంతో ఈయన కొన్నాళ్లు జైలులో ఉండి తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

కందికుంటపై 9 కేసులు..

సాధారణంగా కోర్టులో శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీకి అర్హులు కాదు. కందికుంట వెంకటప్రసాద్‌ స్వయంగా తనపై ఐపీసీ సెక్షన్‌ 420, 302, 307, 324, 375, 471, 147, 149 సెక్షన్ల కింద 9 కేసులున్నట్లు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కోర్టులో శిక్ష పడిన వ్యక్తి ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాడని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈయన ప్రత్యర్థులు కొందరు అప్పటి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తెచ్చారు. అయితే హైకోర్టు అనుమతితోనే ఆయన పోటీ చేస్తున్నారని, అందుచేత అతని నామినేషన్‌ను తిరస్కరించేది లేదని ఆర్‌ఓ చెప్పారు. కాకపోతే ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పీవీ సిద్దారెడ్డి (ప్రస్తుత ఎమ్మెల్యే) చేతిలో కందికుంట సుమారు 30 వేల ఓట్లతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఎన్నికల్లో పోటీ చేయడని అఫిడవిట్‌..

శిక్ష పడిన వ్యక్తిని భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కందికుంట ప్రత్యర్థులు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు కందికుంట తరఫు న్యాయవాది ఈ కేసులో తన క్లైంట్‌ కందికుంట ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టు తుది తీర్పు వెలువరించే వరకూ కనీసం వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయడని సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చారు. ఈ క్రమంలో తుది తీర్పు రేపో,మాపో వెలువడనుందని తెలిసి కందికుంటతో పాటు ఆయన అనుచరుల్లో టెన్షన్‌ మొదలైంది.

కందికుంట జైలుకెళ్తే కదిరి టికెట్‌ ఎవరికి?..

నకిలీ డీడీల కుంభకోణంలో కందికుంటకు జైలు శిక్ష పడితే కదిరి టీడీపీ టికెట్‌ తనకేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలబడి గెలిచిన తర్వాత టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా చెబుతున్నట్లు ఆయన వర్గీయులు అంటున్నారు. కందికుంట వర్గం మాత్రం కందికుంట జైలుకెళితే కదిరి టీడీపీ టికెట్‌ ఈసారి కందికుంట సతీమణి కందికుంట యశోదమ్మకు ఇస్తారని దీమా వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ డీడీల కేసులో కోర్టు తీర్పు రిజర్వ్‌

8న తుది తీర్పు వెలువడే అవకాశం

ఆందోళనలో కందికుంట వర్గం

Advertisement

What’s your opinion

Advertisement