Sakshi News home page

అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న జానారెడ్డి.. మొత్తంగా 13 శాఖలకు మంత్రిగా సేవలు

Published Mon, Oct 16 2023 1:46 AM

- - Sakshi

సూర్యపేట్‌: సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన కుందూరు జానారెడ్డి ఈసారి అసెంబ్లీ బరినుంచి తప్పుకున్నారు. తన కుమారుడు జైవీర్‌రెడ్డిని ఈసారి పోటీలో దింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని అనుముల గ్రామంలో జన్మించిన ఆయన రాజకీయ ప్రస్థానం 1974లో ప్రారంభమైంది.

అప్పట్లో జయప్రకాష్‌ నారాయణ్‌ చేపట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమానికి ఆకర్షితులై 1977లో జనతా పార్టీలో చేరి.. అదేపార్టీ నుంచి 1978లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో దిగారు. 55 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు అసెంబ్లీకి 11సార్లు పోటీ చేయగా, నాలుగు సార్లు ఓడిపోయిన ఆయన ఏడుసార్లు గెలుపొందారు. అందులో 14 ఏళ్లకు పైగా మంత్రిగా సేవలు అందించారు.

చలకుర్తి నుంచి మొదటిసారిగా పోటీ..
1967లో చలకుర్తి నియోజకవర్గం ఏర్పాటు కాగా 2004 వరకు అదే పేరుతో కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 నుంచి చలకుర్తిని నాగార్జునసాగర్‌ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. జానారెడ్డి 1978లో చలకుర్తి నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నిమ్మల రాములు చేతిలో ఓడిపోయారు. 1983 ఎన్నికల్లో జానారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నిమ్మల రాములుపై గెలిచి ఆ తరువాత టీడీపీలో చేరారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాగ్యానాయక్‌పై గెలిచారు.

ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జానారెడ్డి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయగా, టీడీపీ అభ్యర్థి గోపగాని పెద నర్సయ్యపై గెలుపొందారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్‌ చేతిలో ఓడిపోయారు.1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గుండెబోయిన రాంమూర్తి యాదవ్‌పై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తేరా చినపరెడ్డిపైనా గెలుపొందారు.

2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి తన కుమారుడు జైవీర్‌రెడ్డిని రంగంలోకి దింపారు.

రాష్ట్రంలోనే సీనియర్‌ మంత్రిగా జానారెడ్డి రికార్డు..
పలు కీలక శాఖల మంత్రి పదవుల్లో కొనసాగిన కుందూరు జానారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. అత్యధిక కాలం మంత్రిగా (14 ఏళ్ల 11 నెలలు) పని చేశారు. 1988లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి సొంతంగా తెలుగు మహానాడు పార్టీని స్థాపించారు.

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జానారెడ్డి హోం, వ్యవసాయ, హౌజింగ్‌, సహకార, పంచాయతీ రాజ్‌, రవాణా, రోడ్లు, ఫారెస్ట్‌, తూనికలు, భవనాలు, గ్రామీణాభివృద్ధి తదితర 13 శాఖలకు మంత్రిగా సేవలందించారు.

Advertisement

What’s your opinion

Advertisement