Sakshi News home page

కొండగట్టుకు ముఖ్య­మంత్రి కేసీఆర్‌

Published Tue, Feb 14 2023 2:41 AM

CM KCR Likely To Visit Kondagattu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కొండగట్టు (చొప్పదండి): ముఖ్య­మంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. దేవస్థానాన్ని రూ. 100 కోట్ల వ్యయంతో అభివృద్ధి్ధ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అభివద్ధి నిధి కింద గత వారమే ఉత్తర్వులు జారీ చేయ­డం తెలిసిందే. ఈ నిధులతో ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై ప్రత్యక్షంగా దే­వాలయ ప్రాంతాన్ని పరిశీలించడంతోపాటు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

ముందుగా నిర్ణయించిన ప్రకా­రం మంగళవారం ఆయన ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉన్నా ఆ రోజు భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వస్తారని... తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సీఎం ఆలయ సందర్శనను ఒకరోజు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. యా­దాద్రి ఆలయ అభివృద్ధి్ధ తరహాలోనే కొండగట్టును అభివృద్ధి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.

యాదాద్రి దేవస్థాన పునర్నిర్మాణానికి ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించిన ఆనంద్‌సాయికి ఈ దేవాలయ అభివృద్ధి నమూనాల రూపకల్పన, వాటి అమ­లును పర్యవేక్షించే బాధ్యత అప్పగించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వెంట ఆనందసాయి కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. దేవాలయంలో భక్తులకు వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై సీఎం దృష్టిసారించినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ భాస్కర్‌ సోమవారం కొండగట్టును సందర్శించారు. సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో 14న సాయంత్రం 4 గంటల నుంచి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.   

Advertisement

What’s your opinion

Advertisement