Sakshi News home page

18 నెలలుగా పెరగనే లేదు!

Published Wed, Jul 19 2023 1:46 AM

Daily wage has not been increased for 18 months salary - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల సగటు వేతన ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో ముగిసిన 18 నెలల కాలంలో వారి వేతనంలో ఎలాంటి ఎదుగుదల లేదని పేర్కొంది. రూ. 14,700 దగ్గరే ఆగిపోయినట్లు వివరించింది.

అయితే పట్టణ ప్రాంతాల్లో సగటు ఉద్యోగి (శాలరీడ్‌ పర్సన్‌) నెలవారీ సగటు వేతనం మాత్రం రూ. 20,030 నుంచి 7.5 శాతం పెరిగి రూ. 21,647కు చేరుకున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. పీఎల్‌ఎఫ్‌ఐ డేటా ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీ లేదా వేతనం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 302తో పోలిస్తే 2023–24 తొలి త్రైమాసికంలో రూ. 368కు పెరిగింది.

అదే పట్టణ ప్రాంతాల్లోని క్యాజువల్‌ లేబర్‌ రోజుకూలీ రూ. 385 నుంచి రూ. 464కు పెరిగింది. దేశంలోని కార్మికశక్తిలో 46 శాతం మంది వ్యవసాయ దిగుబడులపై ఆధారపడి ఉన్నారని... కానీ ఈ ఏడాది తీవ్ర వాతావరణ మార్పులు వారికొచ్చే నెలసరీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో... పట్టణాల్లో ఉత్పత్తి, సర్వీసెస్, ఇతర రంగాల్లో ఉద్యోగులు కేంద్రీకృతమైనట్లు పీఎల్‌ఎఫ్‌ఎస్‌ నివేదిక వెల్లడించింది. 

ప్రైవేటులో ఉపాధిలేమి.. 
పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ప్రైవేటు రంగంలోని ఐటీ, స్టార్టప్‌ సెక్టార్‌లలో ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఉద్యోగులకు అవకాశాలు దక్కకపోవడంతో ఉపాధిలేమి కూడా వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు.

గతేడాదితో పోలిస్తే ‘నెలవారీ హైరింగ్‌ ట్రెండ్స్‌’ దాదాపు 7 శాతం తగ్గిపోయినట్లు ‘ఫౌండిట్‌ ఇనసైట్స్‌ ట్రాకర్‌’ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీస్స్ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలోని మొత్తం 27 పరిశ్రమల్లో 10 శాతం ఉద్యోగాల కల్పన తగ్గినట్లు ట్రాకర్‌ పేర్కొంది. 

ఏయే రంగాల్లో వృద్ధి...

ఫౌండిట్‌ ఇన్‌సైట్స్‌ ట్రాకర్‌ అధ్యయనం ప్రకారం... గతేడాది నుంచి పరిశీలిస్తే కేవలం 9 రంగాల్లో మాత్రమే ఈ–రిక్రూట్‌మెంట్‌ కార్యకలాపాలు పెరిగాయి. ఇందులోనూ షిప్పింగ్‌/మెరైన్‌ పరిశ్రమ అత్యధికంగా 45 శాతం వృద్ధిని నమోదు చేసింది.

డేటా ఆధారంగా వ్యూహాలు రూపొందించుకొనే అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్‌–పీఆర్‌ పరిశ్రమలు 28 శాతం రిక్రూట్‌మెంట్‌ యాక్టివిటీ పెరుగుదల సాధించాయి. రిటైల్, ట్రావెల్, టూరిజం రంగాలు గతేడాదితో పోచ్చితే 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 

ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం... 

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగట్లేదు. దీంతో ఈ ప్రాంతాల్లోని ఉద్యోగుల నిజ వేతనాలు (రియల్‌ వేజ్‌) పెరగక ఇబ్బందిపడుతున్నారు. పట్టణ ప్రాంతాలోన్లూ అదే పరిస్థితి నెలకొంది.

పైకి చూస్తే వేతనం ద్వారా నిర్ణిత ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా గత నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జనం చేతుల్లో డబ్బుల్లేక వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీనికితోడు ఉపాధి హామీ పనిదినాలు తగ్గడం గ్రామీణ ప్రాంత దినసరి కూలీలపై మరింత ప్రభావం చూపుతోంది.

గ్రామీణ భారతంలో సగటు వేతన జీవులు ఉసూరుమంటున్నారు..అత్తెసరు వేతన ఆదాయంతో బతుకుబండిని భారంగా లాగుతున్నారు..పల్లెల్లో చాలీచాలని ఆదాయంతో సర్దుకుంటున్నారు. కేంద్ర గణాంక శాఖ పరిధిలోని నేషనల్‌ శాంపిల్‌ సర్వే కార్యాలయం 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

ఈ సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేతన జీవి సగటు ఆదాయం గత ఏడాదిన్నర నుంచి రూ. 14,700 వద్దే నిలిచిపోయింది. మరోవైపు ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన మరో అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ ప్రాంత ఉద్యోగి సగటు ఆదాయం రూ. 21,647గా నమోదైంది. 

Advertisement

What’s your opinion

Advertisement