Sakshi News home page

రుణమాఫీ సొమ్ము వెనక్కి

Published Thu, Aug 10 2023 3:25 AM

A flood of complaints to the Department of Agriculture - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ సొమ్ము కొందరు రైతుల ఖాతాల్లో పడకుండా వెనక్కి వస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయా రైతుల రుణ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌లో ఉండటం లేదా డిఫాల్ట్‌లో ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో అనేకమంది రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు రూ.50 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి నట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. 

మూడు సీజన్లలో చెల్లించకుంటే డిఫాల్టరే... 
రాష్ట్రంలో ప్రతీ ఏటా సరాసరి 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూడు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే, తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించడం, వాటిని ఇటీవలి వరకు తీర్చకపోవడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు.

మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పుడు టీఆర్‌ఎస్‌(ఇప్పుడు బీఆర్‌ఎస్‌) హామీ ఇచ్చి న సంగతి తెలిసిందే. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

గత నాలుగేళ్లలో దాదాపు రూ.1,200 కోట్లకు పైగా రుణమాఫీ చేశారు. మిగిలిన మొత్తం సొమ్మును మరో నెలన్నరలో మాఫీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సొమ్మును విడతల వారీగా జమ చేస్తున్నారు. 

బకాయిలు చెల్లించమని సర్కారు విన్నవించినా... 
ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో అనేకమంది రైతులకు రెన్యువల్‌ సమస్య వచ్చి ంది. రెన్యువల్‌ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు గుంజుకున్నాయి. అలా రెన్యువల్‌ చేశాయి.

రుణం పొందాలంటే రెన్యువల్‌ చేయాల్సి ఉంటుంది కాబట్టి రైతులు బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం గతంలో విన్నవించిన సంగతి తెలిసిందే. కొందరు రైతులు అలా చెల్లించగా, మరికొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీంతో 10 లక్షల మంది వరకు రైతులు డిఫాల్టర్లుగా మిగిలినట్లు అంచనా.

రుణమాఫీ అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. అనేక కారణాలతో రైతుల రుణ ఖాతాలు ఫ్రీజ్‌ కావడమో, నిలిచిపోవడమో జరగడం వల్ల ఇప్పుడు సమస్య వచ్చి పడింది. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు.  

Advertisement

What’s your opinion

Advertisement