Sakshi News home page

విద్యాసంస్థలకు సెలవులు.. పరీక్షలు వాయిదా

Published Fri, Jul 21 2023 1:44 AM

Holidays to educational institutions due to rains  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వానలు పడుతుండటంతో ప్రభుత్వం గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వానలు తగ్గకపోతే శనివారం కూడా సెలవు ఇవ్వాలని క్షేత్రస్థాయిలో అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన పలు పరీక్షలను రద్దు చేశారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జరిగే ఇంటర్నల్‌ పరీక్షలను రద్దు చేశారు. వీటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. ఇక ఇంజనీరింగ్‌ సహా వివిధ రకాల కౌన్సెలింగ్‌ల తేదీలను మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు. 

అకస్మాత్తుగా సెలవు నిర్ణయంతో.. 
రెండు రోజులుగా వానలు పడుతుండటంతో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలన్న విజ్ఞప్తులు వచ్చాయి. కానీ దీనిపై బుధవారం రాత్రి వరకు కూడా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టుగా గురువారం ఉదయం ప్రకటించారు. ఇది కూడా జిల్లా అధికారులకు మెసేజీల ద్వారా తెలిపారు. మీడియాకు సమాచారం ఇవ్వలేదు. దీనితో సెలవుల విషయం తెలిసేసరికే విద్యార్థులంతా వానలో ఇబ్బందిపడుతూనే స్కూళ్లకు చేరారు.

కొన్నిచోట్ల అప్పటికప్పుడే విద్యార్థులను తిప్పి పంపేయగా.. మరికొన్ని విద్యా సంస్థలు ఒంటి గంట వరకు ఇళ్లకు పంపించాయి. ఆటోల్లో, సైకిళ్లపై, నడుచుకుంటూ బడులకు వచ్చే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సెలవు విషయం తెలియడంతో తల్లిదండ్రులు హడావుడిగా స్కూళ్ల వద్దకు వచ్చి పిల్లలను తీసుకెళ్లాల్సి వచ్చింది. 

ఇంటర్నెట్‌ ఇబ్బందితో.. 
ఎంసెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఇటీవలే మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. ఈ నెల 22 నాటికల్లా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంది. రెండు రోజులుగా వానలతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది.

దీనితో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడానికి ఇబ్బంది పడుతున్నామని, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరు తెలిపారు. ఇక గురువారం జరగాల్సిన టైప్‌ రైటింగ్, షార్ట్‌ హ్యాండ్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. 

హాస్టళ్ల నుంచి ఇళ్లకు.. 
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. చాలాచోట్ల హాస్టళ్ల చుట్టూ నీరు చేరడం, పలుచోట్ల పైకప్పుల నుంచి నీరు కారడంతో ఇబ్బందిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో శుక్ర, శనివారాలు సెలవు 
ఎడతెరిపిలేని వానల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అన్నిరకాల విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. వైద్యం, పాల సరఫరా వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపింది.

ప్రైవేటు సంస్థలు కూడా వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను ఆదేశించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారి జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలకు రెండు రోజుల సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

Advertisement

What’s your opinion

Advertisement