Sakshi News home page

ఇక ‘లెవల్‌’ క్లియర్‌

Published Thu, Sep 14 2023 2:35 AM

Railway lines without level crossings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారుల తరహాలో క్రాసింగ్స్‌ లేకుండా రైల్వే లైన్లను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు మార్గాన్ని రోడ్లు క్రాస్‌ చేసే ప్రాంతాల్లో, వాటి మీదుగా వెళ్లే వాహనాల రద్దీ ఆధారంగా రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, రోడ్‌ అండర్‌ బ్రిడ్జీలు, తక్కువ ఎత్తున్న అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు.

ప్రాజెక్టు ప్రణాళికల సమయంలోనే ఇందుకు ఏర్పాట్లు చేసి అంచనా వ్యయాన్ని నిర్ధారించనున్నారు. ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఎక్కడా ఇతర రోడ్లు క్రాస్‌ చేయకుండా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో రైల్వే లైన్లను కూడా నిర్మించాలని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. నిర్ణయించటమే కాకుండా వెంటనే అమలులోకి తెచ్చింది.

ఇప్పటికే మొదలైన ప్రాజెక్టుల్లో సైతం: ఈ నిర్ణయం తీసుకునేసరికే మొదలై పనులు జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో మనోహరాబాద్‌–కొత్తపల్లి కొత్త లైన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కీలక ప్రాజెక్టు. మేడ్చల్‌ సమీపంలోని మనోహరాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈ కొత్త లైన్‌ మొదలై గజ్వేల్, సిద్దిపేట మీదుగా కొత్తపల్లి  (కరీంనగర్‌ సమీపం) వరకు ఇది కొనసాగుతుంది.

ప్రస్తుతం సిద్దిపేట వరకు పనులు పూర్తయ్యాయి. గజ్వేల్‌ సమీపంలోని కొడకండ్ల–సిద్దిపేట మధ్య ఈనెల 15న రైల్వే సేఫ్టీ కమిషనర్‌ ఆధ్వర్యంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ఇది పూర్తి అయ్యాక వీలైనంత తొందరలో సిద్దిపేట నుంచి రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. ఈమేరకు అనుమతి ఇవ్వాల్సిందిగా రైల్వే బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ ప్రాజెక్టులో కీలక ప్రాంతాల్లో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు ప్లాన్‌ చేసినా.. ఇంకా నాలుగు లెవల్‌ క్రాసింగ్స్‌ ఉన్నాయి.

మనోహరాబాద్‌–కొత్తపల్లి లైన్‌లోని ఆ నాలుగులెవల్‌ క్రాసింగ్స్‌ కూడా తొలగింపు
తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు, ఆ నాలుగు లెవల్‌ క్రాసింగ్స్‌ను కూడా తొలగించాలని నిర్ణయించటం విశేషం. గజ్వేల్‌ దాటిన తర్వాత ఉన్న కొడకండ్ల శివారులోని రామచంద్రాపూర్‌ రోడ్డు వద్ద లెవల్‌ క్రాసింగ్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ 3.5 మీటర్ల ఎత్తుతో లిమిటెడ్‌ ఆర్‌యూబీ నిర్మించాలని నిర్ణయించారు.

కుకునూరుపల్లి  దాటిన తర్వాత కొండపోచమ్మ దేవాలయానికి వెళ్లే రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన లెవల్‌ క్రాసింగ్‌ను తొలగించి ఆర్‌యూబీ నిర్మించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లికి వెళ్లే రెండో కమాన్‌ రోడ్డు వద్ద ఉన్న లెవల్‌ క్రాసింగ్‌ను తొలగించి దాదాపు అరకి.మీ. నిడివితో ఏడు మీటర్ల ఎత్తు గల ఆర్‌ఓబీని నిర్మించాలని నిర్ణయించారు. సిద్దిపేట శివారులోని రంగదామ్‌పల్లి లెవల్‌ క్రాసింగ్‌ వద్ద ఆర్‌యూబీ నిర్మించాలని నిర్ణయించారు.

ఇంకా 1,150 లెవల్‌ క్రాసింగ్స్‌...
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పాత లైన్ల మీద ఇంకా 1,150 వరకు లెవల్‌ క్రాసింగ్స్‌ ఉన్నాయి. కాపలా లేని క్రాసింగ్స్‌ను పూర్తిగా తొలగించినా, కాపలా ఉన్న లెవల్‌ క్రాసింగ్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని దశల వారీగా తొలగించే పని జరుగుతోంది. కానీ, కొత్తగా చేపట్టిన, చేపట్టబోయే ప్రాజెక్టుల్లో మాత్రం అసలు లెవల్‌ క్రాసింగ్స్‌ ఉన్న ఊసే ఉండకపోవటం విశేషం.

Advertisement

What’s your opinion

Advertisement