Sakshi News home page

అధిక మాసంలోనూ ‘అదరగొట్టారు’ 

Published Thu, Aug 17 2023 1:53 AM

Record number of wineshop applications on 14th of this month - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధిక మాసంలోనూ వైన్‌షాపు టెండర్ల ప్రక్రియ అదిరిపోయింది. ఈసారి ఎలాగైనా మద్యం షాపులు దక్కించుకోవాలన్న వ్యాపారుల ఆశతో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈనెల 14న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, 15వ తేదీన సెలవుదినం కావడంతో 16వ తేదీ బుధవారం 8,500 పైగా దరఖాస్తులు వచ్చాయి.

మొత్తం మీద 14, 16 తేదీల్లో కలిపి.. 23 వేల వరకు దరఖాస్తులు రాగా, ఈనెల 4 నుంచి 16 వరకు మొత్తం కలిపి 43,500 పైగా దరఖాస్తులు వచి్చనట్టు సమాచారం. కాగా, గత రెండేళ్ల కాలానికి గాను మొత్తం 10 రోజుల్లో 69 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఈసారి తొలి పది రోజుల్లో 43,500 మాత్రమే రావడం గమనార్హం. అయితే, ఈసారి గడువు రెండు రోజులు ఎక్కువగా ఇవ్వడం, అధిక శ్రావణం ముగిసి శ్రావణ మాసం రావడంతో చివరి రెండు రోజుల్లోనూ భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది.

ఇప్పటికే వేలాది మంది డీడీలు తీసి, శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చివరి రెండురోజులైన గురు, శుక్రవారాల్లో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని, గతం కంటే ఇప్పుడు ఎక్కువే దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నామని ఎక్సైజ్‌ అధికారులు చెపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.870 కోట్ల ఆదాయం సమకూరింది. చివరి రెండు రోజుల్లో కలిపి మరో రూ.500 కోట్ల వరకు వస్తుందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది.   

Advertisement

What’s your opinion

Advertisement