Sakshi News home page

అనుసరణీయం..మహనీయుల మార్గం

Published Thu, Nov 16 2023 6:02 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, వేదికపై ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు - Sakshi

తిరుపతి కల్చరల్‌ : సమాజ హితం కోసం నిరంతరం శ్రమించిన మహనీయుల మార్గం అందరికీ అనుసరణీయమని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. బుధవారం నగరంలోని గిరిజన భవన్‌లో గిరిజన స్వాభిమాన ఉత్సవాలు–2023 నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ బిర్సా ముండా జీవించింది 25 ఏళ్లే అయినా బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాడిన తీరు చిరస్మరణీయమన్నారు. అప్పటి బీహార్‌, ఇప్పటి జార్ఖండ్‌లో ఆయనను దేవుడిగా పూజిస్తుంటారన్నారు. అంతటి మహనీయుడి జయంతిని జన జాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. నిరుపేద గిరిజ న కుటుంబంలో జన్మించిన వ్యక్తి అప్పట్లో చదువుకోవడం వల్లే బ్రిటిష్‌ పాలనలో అన్యాయాలను గుర్తించి, పోరాడగలిగారని వివరించారు. అల్లూరి సీతారామరాజు సైతం చదువుకోవడం వల్లే పోరాడే తత్వం అలవడిందని చెప్పారు. అందుకే ప్రభుత్వం విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మహనీయుల జయంతి, వర్ధంతిని గుర్తు చేసుకుంటూ, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటే వెనుకబాటు తనాన్ని తగ్గించవచ్చని తెలిపారు. తమ సహచర డాక్టర్లు చాలామంది వారి పిల్లలను ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులుగా తీర్చిదిద్దారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించారని, అందుకే చదువుతోనే సమాజ అభ్యున్నతి సాధ్యమని గుర్తించారని వెల్లడించారు. త్యాగమూర్తుల జీవిత విశేషాలు స్ఫూర్తిగా తీసుకుని విద్యను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కోరారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడిత్యా శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ గిరిజన బిడ్డ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కేబినెట్‌లో గిరిజనులకు పెద్దపీట వేశారని వెల్లడించారు. అనంతరం గిరిజన నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్‌ఓ పెంచల కిషోర్‌, గిరిజన నేతలు అక్కులప్ప నాయక్‌, చిరంజీవి, రఘురాం, సరస్వతి, కోటయ్య, ప్రభావతి, వసంతమ్మ, మల్లికార్జున, రామచంద్రయ్య, రామయ్య, పాండురంగవిఠల్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement