Sakshi News home page

మునుగోడు బీజేపీ టికెట్‌ దక్కేదెవరికో?

Published Thu, Oct 26 2023 6:54 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఆలేరు, మునుగోడు, నకిరేకల్‌ బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. తొలి జాబితాలో భువనగిరి, తుంగతుర్తి అభ్యర్థుల పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జిల్లా కేడర్‌లో జోష్‌ నింపింది. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికతో పార్టీలో మరింత జోష్‌ పెరిగింది. వీటితో పాటు పార్టీ విస్తృతంగా చేపట్టిన కార్యక్రమాలతోనూ ప్రజ ల్లో ఆదరణపెరిగింది. దీంతో ఆశావహులు టికెట్‌ కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివిధ సంస్థలు చేసిన సర్వేల ఆధారంగా భువనగిరి, తుంగతుర్తి టికెట్లు ప్రకటించిన అధి ష్టానం.. ఆలేరు, మునుగోడు, నకిరేకల్‌ను పెండింగ్‌లో పెట్టింది. భువనగిరి నుంచి గూడూరు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య పేర్లను ఖరారు చేసింది.

అందరి దృష్టి మునుగోడుపైనే..
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మునుగోడు టికెట్‌ ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలోనే రాజగోపాల్‌రెడ్డి పేరు వస్తుందని బీజేపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆశించారు. కానీ, ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు రాజగోపాల్‌రెడ్డి తెరదించారు. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకీ లేదని, కాంగ్రెస్‌ మాత్రమే ప్రత్యామ్నాయంగా కన్పిస్తుందని భావించి తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు.

ఆలేరు నుంచి ఐదుగురు ప్రయత్నం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అభ్యర్థిగా దొంతిరి శ్రీధర్‌రెడ్డి పేరును తొలి విడతలోనే ప్రకటించారు. ఈసారి భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరినప్పటికీ ఆయన తిరస్కరించారు. ప్రస్తుతం పడాల శ్రీనివాస్‌, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, సూదగాని హరిశంకర్‌గౌడ్‌, కాసం వెంకటేశ్వర్లు, పల్లెపాటి సత్యనారాయణలు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు సాగి స్తున్నారు. వీరిలో కాసం వెంకటేశ్వర్లు 2009, 2014లో ఆలేరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నకిరేకల్‌లో భువనగిరికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి పోటీ చేసి పరాజయంపాలయ్యారు.

బూర నర్సయ్యగౌడ్‌పై అధిష్టానం ఆసక్తి
రాజగోపాల్‌రెడ్డి బీజేపీని వీడడంతో మునుగోడు నుంచి ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయనున్నారనే చర్చకు తెరలేచింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను బరిలోకి దించేందుకు బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అయితే బూర నర్స య్యగౌడ్‌ మాత్రం ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి 2018లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన గంగిడి మనోహర్‌రెడ్డికి టికెట్‌ వస్తుందని బీజేపీలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement