Sakshi News home page

హత్య కేసులో ఆరుగురికి జీవిత ఖైదు

Published Thu, Sep 5 2013 4:05 AM

Man to life imprisonment for the murder

 ముద్దనూరు, న్యూస్‌లైన్ : ఓ హత్య కేసులో నిందితులైన ఆరుగురికి సుప్రీంకోర్టు జీవిత ఖైదు ఖరారు చేస్తూ బుధవారం తీర్పు వెలువరించినట్లు తెలిసింది. ముద్దనూరు మండలంలో ఫ్యాక్షన్ గ్రామమైన కోడిగాండ్లపల్లెకు చెందిన ఆరుగురు(ఇందులో ఒకరు మృతిచెందారు) టీడీపీ వర్గీయులకు ఈ శిక్ష పడింది. కాంగ్రెస్ నాయకుడు యర్రపురెడ్డి రామచంద్రారెడ్డి హత్య కేసులో శిక్ష పడిన వారిలో రాయపాటి వెంకటరెడ్డి, రాయపాటి రామాంజులరెడ్డి, రాయపాటి బీమారెడ్డి, కొర్రపాటి తిమ్మారెడ్డి, కడియం రామిరెడ్డి ఉన్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషనుకు సమాచారం అందింది. వివరాల్లోకి వెళ్తే.. 1999, డిసెంబరు 4వతేదీన కోడిగాండ్లపల్లెలో కాంగ్రెస్ నాయకులు యర్రపురెడ్డి రామచంద్రారెడ్డి, యర్రపురెడ్డి బాలగంగిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు.
 
 ఈ రెండు హత్యలపై అప్పట్లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. యర్రపురెడ్డి రామచంద్రారెడ్డి హత్యకేసులో నిందితులైన వారిలో ఆరుగురు టీడీపీ వర్గీయులకు 2004 డిసెంబరు 22న ప్రొద్దుటూరు సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్ష అనుభవిస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. 2007లో నిందితులపై హైకోర్టు కేసు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో బాధితులు  సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆరుగురు నిందితులకు శిక్ష ఖరారు చేసింది. శిక్ష పడినవారిలో కొర్రపాటి రామిరెడ్డి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కాగా యర్రపురెడ్డి బాల గంగిరెడ్డి హత్య కేసులో శిక్షకు గురైనవారు కూడా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శిక్ష పడిన వారిని జైలుకు అప్పగించేందుకు సుమారు 30రోజులు గడువున్నట్లు సమాచారం. కోడిగాండ్లపల్లెలో ఇప్పటికీ పోలీస్ పికెట్ కొనసాగుతోంది.
 

Advertisement

What’s your opinion

Advertisement