Sakshi News home page

జీర్ణవ్యవస్థకు ఆరోగ్యకరం... మరమరాలు!

Published Sun, Nov 19 2017 11:50 PM

good food for good health - Sakshi

మరమరాలు చాలా తేలిగ్గా ఉండి, తిన్నట్టే అనిపించని ఆహారం. కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయవి. వీటినే కొన్ని చోట్ల బొరుగులు అంటారు. వీటిలో కొవ్వులూ, క్యాలరీలు చాలా తక్కువ. మరమరాలతో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి...
మరమరాలు తేలికపాటి ఆహారం. వీటిలో పీచు కూడా ఎక్కువే. అందుకే చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి, మలబద్దకాన్ని నివారిస్తాయి. పేగు కదలికల్లో చురుకుదనం వస్తుంది, దాంతో జీవక్రియలు వేగవంతమై తిన్నవారు చురుగ్గా ఉంటారు.  
మరమరాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. దాంతో గుప్పెడన్ని తిన్నా... ఒంటిని తేలికగానే ఉంచుతూనే మరింత ఎక్కువ శక్తిని సమకూరుస్తాయి. అందుకే కొన్ని పనుల్లో చురుకుగా ఉండాల్సినప్పుడు కొందరు బ్రేక్‌ఫాస్ట్‌లో దీన్ని వరి అన్నానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు.
మరమరాల్లో విటమిన్‌–డి, విటమిన్‌–బి కాంప్లెక్స్‌లోని రైబోఫ్లేవిన్, థయామిన్‌ ఎక్కువ. వాటితో పాటు క్యాల్షియమ్, ఐరన్‌ కూడా ఎక్కువే. అందుకే ఇవి ఎముకలు, పళ్లు మరింత పటిష్టంగా, బలంగా ఉండేలా చూస్తాయి. ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి.
రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. తద్వారా గుండె ఆరోగ్యానికీ తోడ్పడతాయి.
మెదడుకు చురుకుదనాన్ని ఇవ్వడంతో పాటు నాడీమండలంలోని నరాలను ఉత్తేజితం చేస్తాయి. ఫలితంగా మరమరాలు జ్ఞాపకశక్తిని, నేర్చుకునే శక్తిని పెంపొందిస్తాయి.  
మరమరాల్లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ–రాడికల్స్‌ను నిరోధిస్తాయి.
చర్మానికి మేలు చేస్తాయి. మేని నిగారింపునకు తోడ్పడతాయి.

ఒకింత జాగ్రత్త
వరి అన్నం లాగే ఇందులోనూ కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువ. కాబట్టి డయాబెటిస్‌ రోగులు వరి అన్నానికి  మరమరాలు ప్రత్యామ్నాయమని అనుకోవడం సరికాదు. డయాబెటిస్‌ ఉన్నవారు వీటిని పరిమితంగానే తినాలి. అలాగే వీటిని కొద్దిగా ఎక్కువ తిన్న వెంటనే సంతృప్త భావన కలుగుతుంది. దాంతో త్వరగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి మరమరాలతో చేసే శ్నాక్స్‌ మంచివే. అయినప్పటికీ... వరి బియ్యంలాగానే వీటిలోనూ కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువ. మరమరాలు తేలికపాటి ఆహారం అనే భావనతో మరీ ఎక్కువగా కాకుండా పరిమితంగా తినడమే మేలు.

Advertisement

What’s your opinion

Advertisement