ఆనందారోగ్యాలకు పది సూత్రాలు

19 Dec, 2019 00:12 IST|Sakshi

మంచి జీవనశైలి అనుసరించేవారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. దాని తర్వాత రెండో ప్రాధాన్యత క్రమంలో వ్యాయామం ఉంటుంది. వ్యాయామం వల్ల రెండు లాభాలు. మొదటిది ఆకర్షణీయమైన సౌష్టవంతో చూడ్డానికి అందంగా కనిపిస్తారు. అలాగే ఎప్పుడూ  ఫిట్‌నెస్‌తో ఉంటారు. ఈ రెండూ ఉంటే ఆత్వవిశ్వాసమూ పెరుగుతుంది. ‘సౌండ్‌ మైండ్‌ ఇన్‌ సౌండ్‌ బాడీ’ అనే నానుడి వినే ఉంటారు.

మంచి ఆరోగ్యం ఉన్న దేహంలో ఆరోగ్యకరమైన మనసూ ఉంటుందటి దానర్థం.అంటే ఇలా జీవనశైలి, వ్యాయామాలతో కేవలం దేహ ఆరోగ్యమే కాదు... మానసిక ఆరోగ్యమూ సాధ్యమవుతాయన్నమాట. ‘అందమె ఆనందం’ అన్న సూక్తి కూడా మనందరమూ వింటూ ఉంటాం కదా. పైవన్నీ ఉంటే ఇక ఎప్పుడూ ఆనందంగా ఉండమూ సాధ్యమవుతుంది. అలా ఆరోగ్యం, అందం, ఆనందం కోసం ఆచరించాల్సిన సూచనలు చాలా సులువైనవి, తేలిగ్గా సాధ్యమయ్యేవి. అవేమిటో చూద్దాం.  

1 ఆహారం : పొద్దు న్నే కాస్త ఎక్కువ మోతాదులోనే ∙మంచి బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. ఆ తర్వాత మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా... ఓ మోస్తరుగా మధ్యాహ్న భోజనం తినాలి. ఇక రాత్రివేళ మితాహారం తినడం ఆరోగ్యంగా ఉండటానికి మనం అనుసరించాల్సిన ఆరోగ్య సూత్రం. మన ఆహారంలో ఎంత తింటున్నామనే దానికంటే అన్ని రకాల పోషకాలు అందేలా సమతులాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జంక్‌ఫుడ్‌ను, వీలైనంతవరకు బయటి ఆహారాలను పూర్తిగా మానేయడం మంచిది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపే ఆహారం తినేయాలి. ఇక రాత్రి 10 గంటలు దాటాక ఆహారం తీసుకోవడం సరికాదు.

2 వ్యాయామం : క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమనే నియమాన్ని అందరూ పాటించాల్సిందే. అయితే కొంతమంది కొద్ది రోజులు చేసి, ఆ తర్వాత మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామాన్ని తప్పకుండా కొనసాగించాలి. రోజూ వీలుకాకపోతే కనీసం వారంలో ఐదు రోజుల పాటు రోజులో 45 నిమిషాల నుంచి గంట సేపు వ్యాయామం చేయాల్సిందేనని గుర్తుపెట్టుకోండి.

3 సాకులు వెతకడం మానేయండి : కొన్ని పనులు పూర్తి చేయడం కుదరనప్పుడు దానికి వెంటనే సాకులు వెతుక్కోవడం మానవ సహజం. పైగా కొన్ని పనులు చేయడానికి ఇష్టం లేనప్పుడు కూడా మనం వెంటనే సాకులు వెతుకుతాం. ఆహారం, వ్యాయామం విషయంలో ఇలా సాకులు వెతకడం చాలా సహజం. మంచిపనులు చేయాల్సి వచ్చినప్పుడు సాకులు వెతకడం పూర్తిగా మానేయండి. వెంటనే పని మొదలుపెట్టండి. మంచి ఫలితం ఉంటుంది.

4 ఇష్టమైన ఆట : మీరు ఇష్టంగా ఆడే ఆటను ఎంచుకోండి. అది కూర్చుని ఆడే ఆట కాకుండా... శరీరానికి కాస్తంత శ్రమ కలిగించేదై ఉండాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలు. ఒకవేళ వ్యాయామం చేయడం కష్టమనిపిస్తే... ఆడటం అన్నది వినోదం కాబట్టి... ఆటోమేటిగ్గా ఇటు వినోదం/ఆనందం అటు వ్యాయామం రెండూ ఆటల వల్ల సమకూరతాయి. ఈ ఆటలో మీకెవరైనా భాగస్వామి ఉంటే వారితో వెళ్లడం వల్ల ఆరోగ్యకరమైన చర్చలతో మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటారు. ఈ బిజీలైఫ్‌లో మనకు ఆటలాడే పార్ట్‌నర్‌ దొరకకపోతే కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల సహాయంతో మీ ఇంటి టీవీపైనే మీ క్రీడా భాగస్వామిని ఎంచుకునేందుకూ, అలాంటి ఎలక్ట్రానిక్‌ భాగస్వామితో ఇంట్లోనే ఆడుకునేందుకూ ఇప్పుడు వీలుంది. కాబట్టి ఆటలాడేందుకు క్రీడా భాగస్వామి దొరకడం లేదనే సాకుకు ఇప్పుడు తావే లేదు

5 కొత్తవాటిని నేర్చుకుంటూ ఉండండి : మనమెప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండటం వల్ల నిత్యం యంగ్‌గా ఉంటాం. ఒకవేళ మనకంటే చిన్నవాళ్ల నుంచి ఏవైనా కొత్తవి నేర్చుకోవాల్సి వస్తే అహానికి లోనుకావద్దు. ఎందుకంటే... కొన్ని కొత్త విషయాలు పాతతరం వారికంటే కొత్త తరం వారికే ఎక్కువ తెలుసు.

6 ఎప్పుడూ ఆనందంగా ఉండండి: ఎప్పుడూ దిగులుగా, విచారంగా ఉండకండి. మీరు చేసే ప్రతి పనినీ ఆస్వాదిస్తూ చేస్తూ ఉంటే ఆనందంగా ఉండటం తేలిగ్గా సాధ్యమవుతుంది.

7 నిత్యం స్ఫూర్తి పొందుతూ ఉండండి : మీరు పత్రికలు చదువుతున్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా స్ఫూర్తిదాయకమైన పనులు చేస్తే... వారి నుంచి స్ఫూర్తి పొందండి. ఇలా స్ఫూర్తి పొందడం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. పురోగతికీ తోడ్పడుతుంది.


8 ఓపికగా ఉండండి :  మీరు ఏదైనా లక్ష్యాలు నిర్ణయించుకున్నప్పుడు అవి తీరే వరకు ఓపిక వహించండి. మీ పనిలో కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకండి. అవి తొలగేవరకూ ఓర్పుగా ఉండండి. విజయాలు అవే సిద్ధిస్తాయి.

9 ఎప్పుడూ కుంగిపోకండి : కష్టాలు వస్తే కుంగిపోకండి. కష్టమెప్పుడూ శాశ్వతం కాదు.

10 ప్రయత్నాన్ని వదిలిపెట్టకండి మనం తప్పక  ఆచరించగలమనే వాటినే లక్ష్యాలుగా పెట్టుకోండి. ఆ లక్ష్యసాధనలో ఎప్పుడూ వెనక్కు తగ్గకండి. ఎట్టిపరిస్థితుల్లోనూ  మీ ప్రయత్నాలు వదలకండి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా