Sakshi News home page

విద్యుత్ కోత రోజుకు రెండుసార్లు

Published Sun, Jul 20 2014 10:05 PM

Delhi, NCR faced power outages at least twice a day in June

 విద్యుత్ సరఫరాలో కోత నగరవాసులకు నిత్య సమస్యగా మారింది. వేళాపాళా ఉండకపోవడం, గంటలకొద్దీ విధిస్తుండడంతో వారంతా ఇబ్బందులపాలవుతున్నారు. ఈ సమస్య కేవలం జాతీయ రాజధానికే పరిమితం కాలేదు. జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని  గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోజుకు రెండుసార్లు, దాదాపు నాలుగు గంటలపాటు కోత విధిస్తున్నారనే విషయం ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
 
 న్యూఢిల్లీ: నగరంలో ప్రతిరోజూ రెండుసార్లు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. అది కూడా దాదాపు నాలుగు గంటలపాటు ఉంటోంది. ఈ విషయం ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇక జాతీయ ప్రాదేశిక ప్రాంతం పరిధిలోని గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా విద్యుత్ సరఫరాలో కోత విధింపు అక్కడి ప్రజలకు చుక్కలు చూపుతోంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రతిరోజూ కనీసం రెండు పర్యాయాలు కోత విధిస్తున్నట్టు తెలిపారు. మార్కెట్ ఎక్సెల్ డాటా మ్యాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించింది. ఢిల్లీ, గుర్గా వ్, నోయిడా, ఘజియాబాద్‌లకు చెందిన మూడు వేలమందిని ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యు త్ కోత అంశంపై పలు ప్రశ్నలు అడిగారు. కనీసం రోజుకు రెండుసార్లు వవిద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నట్టు ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, గుర్గావ్‌లకు చెందిన 40 శాతం మంది ప్రజలు తెలిపారు.
 
 ఒక్కోసారి ఈ కోత దాదాపు నాలుగు గంటలకుపైగానే ఉంటోందన్నారు. కోతకు వేళాపాళా ఉండడం లేదని, మిగతా రోజుల్లోనూ, వారాంతంలోనూ ఒకేరకంగా ఉంటోందన్నారు. వారాంతంలో కోత ఎక్కువగా ఉంటోందని నోయిడాకు చెందిన 36 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. గుర్గావ్, నోయిడా ఢిల్లీలలో మధ్యాహ్నంతోపాటు సాయంత్రం కోత విధిస్తున్నారని తెలిపారు. విద్యుత్ సరఫరాలో కోతకు కారణమేమిటని ప్రశ్నించగాా విద్యు త్ ప్లాంట్‌లో వినియోగిస్తున్న పరికరాలు నాసిరకానికి చెందినవే కావడమన్నారు. దీనికితోడు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం, సిబ్బంది పనితీరు అధ్వాన్నంగా ఉండడమేనని 40 శాతం మంది పేర్కొన్నారు. పవర్ ప్లాంట్ల నిర్వహణాలోపం కూడా మరొక కారణమని వారంటున్నారు.
 
 ఆలస్యమే కారణం
 ఇక గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్‌లలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మరింత ఆలస్యమవడం ఈ సమస్యను మరింత జటిలమవడానికి కారణమై ఉండొచ్చని ఆయా ప్రాంతాలకు చెందిన 28 శాతం మంది అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విద్యుత్ ప్రాజెక్టుల మంజూరులో ఆలస్యం కూడా మరొక కారణం కావొచ్చన్నారు. దీనికితోడు విద్యుత్ డిమాండ్ పెరగడం మరొక కారణమవచ్చన్నారు. విద్యుత్ సరఫరాలో నష్టాలు, అతి వినియోగంవల్ల ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్ అవడం. షార్ట్‌సర్క్యూట్, వర్షాలు, పిడుగుపాట్లు, గాలిదుమారం తదితరాలు కూడా ఈ సమస్య మరింత జటిలం చేసేందుకు దోహదం చేస్తున్నాయి.
 
 కాగా విద్యుత్ సరఫరాలో కోత కారణంగా తాము నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోందని ఘజియాబాద్, గుర్గావ్ వాసులు వాపోయారు. దీంతో తాము మరుసటి రోజు విధులకు హాజరు కాలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. దోమల బెడద కూడా బాగా పెరిగిపోయిందనర్నారు. గత ఏడాదినుంచి విద్యుత్ పరిస్థితి మరింత ఘోరంగా మారిందని 50 శాతం కంటే ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. పరిస్థితి గత ఏడాది మాదిరిగానే ఉందని మరో 20 శాతం మంది పేర్కొన్నారు. కాగా విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం ఈ నెల 15వ తేదీన గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,925 మెగావాట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో  గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,810 మెగావా ట్లు మాత్రమే. వాస్తవానికి విద్యుత్ కొరత సమస్య లేదని, అయితే బీఎస్‌ఈఎస్ డిస్కం నెట్‌వర్క్‌లో లోపాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement