Sakshi News home page

రుణ ప్రణాళికేదీ?

Published Mon, Jun 22 2020 10:34 AM

Confusing on crop loans Distribution in Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో వానాకాలం సీజన్‌ రుణ ప్రణాళిక ఖరారు కాలేదు. పంట రుణాల పంపిణీపై ఇంకా సందిగ్ధత నెలకొంది. వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు విత్తనాలు విత్తుతున్నారు. సీజన్‌ ఆరంభంలోనే రుణ ప్రణాళిక విడుదల చేసి వ్యవసాయ అవసరాలకు విరివిగా పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఆ దిశగా అడుగులు పడడం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పంటల సాగుకు కర్షకుల వద్ద డబ్బులు లేవు. రైతుబంధు సొమ్ము ఇంకా అందలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పంట రుణాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో విత్తనాలు విత్తారు. మరికొన్ని రోజుల్లో పంటల సాగు మరింత ఊపందుకోనుంది.

వీలైనంత త్వరంగా ప్రణాళిక ఖరారు చేసి రుణ వితరణ చేపడితేనే రైతుకు అండ లభిస్తుంది. గతేడాది రూ.1,050.55 కోట్లతో ఖరీఫ్‌ రుణ ప్రణాళిక ఖరారు చేయగా.. ఇందులో రూ.486.34 కోట్లను మాత్రమే రైతులకు రుణంగా ఇచ్చారు. జిల్లాలో వానాకాలం సాగే కీలకమైనది. ముఖ్యంగా ఈ సీజన్‌లో పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నియంత్రిత సాగు విధానాన్ని జిల్లా వ్యవసాయ శాఖ రూపొందించింది. రికార్డు స్థాయిలో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. దాదాపు 4 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారని ప్రణాళికలో పేర్కొన్నారు. ప్రధానంగా పత్తి రెండు లక్షల ఎకరాల్లో సాగవుతుందని ప్రస్తావించారు. ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో 70వేల ఎకరాల్లో విత్తనాలు విత్తినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 60వేల ఎకరాల్లో పత్తికాగా.. మరో పది వేల ఎకరాల విస్తీర్ణంలో కంది, జొన్న, పెసర తదితర పంటలు వేశారు. అంటే.. సాగు ప్రారంభమైనా రుణ ప్రణాళిక ఖరారు కాకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా మే నెలలోనే ప్రణాళికకు తుదిరూపు ఇచ్చి రుణ వితరణ మొదలు పెట్టాల్సి ఉంది. కోవిడ్‌ నేపథ్యలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఆలస్యం జరిగిందని బ్యాంకర్లు వెల్లడిస్తున్నారు.  

బ్యాంకుల మెలిక..: జిల్లా వ్యాప్తంగా 2.70 లక్షల మంది రైతులు
ఉండగా ఇందులో సుమారు 1.60 లక్షల మంది పంట రుణాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రుణ ప్రణాళికతో సంబంధం లేకుండా కొన్ని బ్యాంకులు రైతులకు పంట రుణాలు పంపిణీ చేస్తున్నాయి. మిగిలిన బ్యాంకర్లు మెలిక పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం తాజాగా పంట మార్పిడి విధానాన్ని తెరపైకి తేవడంతో వ్యవసాయ శాఖ దానిపైనే ప్రధానదృష్టి కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు విరివిగా రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్‌బీఐ నుంచి నిబంధనలు రాకపోవడం వల్లనే రుణ ప్రణాళిక ఖరారులో జాప్యం జరిగిందని లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ రిజ్వాన్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రణాళిక ఖరారవుతుందని చెప్పారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు రుణ వితరణ చేపట్టాయన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement