స్టవ్‌ వెలిగించకుండానే.. పండంటి వంటలు.. | Sakshi
Sakshi News home page

స్టవ్‌ వెలిగించకుండానే.. పండంటి వంటలు..

Published Fri, Feb 2 2024 4:05 PM

Fruity Dishes Without Lighting The stove - Sakshi

ఆరోగ్యంగా పెరగాలంటే రోజూ పండ్లు తినాలి. ఇది డాక్టర్‌ మాట.. అలాగే అమ్మ మాట కూడా. రోజూనా.. నాకు బోర్‌ కొడుతోంది.. పిల్లల హఠం. రోజూ తినే పండ్లనే కొత్తగా పరిచయం చేద్దాం. చేయడం సులభం... స్టవ్‌ వెలగాల్సిన పని లేదు. గరిట తిప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు.

స్ట్రాబెర్రీ విత్‌ క్రీమ్‌..
కావలసినవి: స్ట్రాబెర్రీ ముక్కలు – వంద గ్రాములు (కడిగి పలుచగా తరగాలి); మీగడ– వంద గ్రాములు; ఐసింగ్‌ షుగర్‌ లేదా మామూలు చక్కెర పొడి– 2 టేబుల్‌ స్పూన్‌లు; గార్నిష్‌ కోసం.. స్ట్రాబెర్రీలు – 2 టీ స్పూన్‌; బ్లాక్‌ సాల్ట్‌ – చిటికెడు;
తయారీ:

  • మీగడను బాగా చిలికి నాజిల్‌ ఉన్న ట్యూబ్‌లో వేయాలి. కోన్‌ అయినా ఫర్వాలేదు.
  • అదీ లేకపోతే జంతికల గొట్టంలో స్టార్‌ డిజైన్‌ ఉన్న ప్లేట్‌ అమర్చి ఉపయోగించుకో వచ్చు.
  • స్ట్రాబెర్రీ ముక్కలను గ్లాసులో పావు వంతు వేయాలి.
  • ఆ పైన కొద్దిగా మీగడ అమర్చాలి.
  • ఆ పైన మళ్లీ ఒక వరుస స్ట్రాబెర్రీ ముక్కలు, ఆ పైన మీగడ వేయాలి.
  • చివరగా ఒక స్ట్రాబెర్రీ అమర్చి సర్వ్‌ చేయాలి.

చట్‌పటా పొమోగ్రనేట్‌..
కావలసినవి: దానిమ్మ గింజలు – ముప్పావు కప్పు; చాట్‌ మసాలా – పావు టీ స్పూన్‌; ఆమ్‌చూర్‌ పౌడర్‌ – పావు టీ స్పూన్‌ (ఆమ్‌చూర్‌ పౌడర్‌ లేకపోతే పచ్చి మామిడి తురుము టీ స్పూన్‌); జీలకర్ర పొడి– పావు టీ స్పూన్‌; బ్లాక్‌ సాల్ట్‌ – చిటికెడు

తయారీ:
ఒక కప్పులో వీటన్నింటినీ వేసి స్పూన్‌తో కలిపితే చట్‌పటా పొమోగ్రనేట్‌ రెడీ. పిల్లలకు బాక్సులో పెట్టడానికి కూడా బావుంటుంది.

డ్రాగన్‌ – కోకోనట్‌ స్మూతీ..
కావలసినవి: డ్రాగన్‌ ఫ్రూట్‌ ముక్కలు – కప్పు; కొబ్బరి పాలు – కప్పు; స్వచ్ఛమైన తేనె – టేబుల్‌ స్పూన్‌; ఐస్‌ క్యూబ్స్‌ – 10 (ఇష్టమైతేనే)
తయారీ:

  • పచ్చి కొబ్బరిని గ్రైండ్‌ చేసి పాలు తీసుకోవచ్చు లేదా రెడీమేడ్‌ కోకోనట్‌ మిల్క్‌ తీసుకోవచ్చు.
  • డ్రాగన్‌ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా బ్లెండ్‌ చేసి అందులో కొబ్బరి పాలు వేసి మొత్తం కలిసే వరకు బ్లెండ్‌ చేయాలి.
  • పెద్ద గ్లాసులో పోసి తేనె కలిపి సర్వ్‌ చేయాలి.
  • బ్లెండ్‌ చేసిన వెంటనే తాగేటట్లయితే తేనె కూడా అప్పుడే వేసుకోవచ్చు.
  • డ్రాగన్‌ – కొబ్బరి పాల మిశ్రమాన్ని ముందుగా చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని తర్వాత తాగాలంటే తాగే ముందు తేనెను కలుపుకోవాలి. 

గ్రీన్‌ గ్రేప్‌ సోర్బెట్‌..
కావలసినవి: ఆకుపచ్చ ద్రాక్ష – 200 గ్రాములు; అల్లం తురుము – టీ స్పూన్‌; నిమ్మరసం– 2 టీ స్పూన్‌లు; చక్కెర – టీ స్పూన్‌ (అవసరం అనిపిస్తేనే) గార్నిష్‌ చేయడానికి.. పుదీన ఆకులు – 20.
తయారీ:

  • ద్రాక్షను మంచినీటితో శుభ్రం చేసి ఆ తరవాత గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి అందులో వేయాలి.
  • ద్రాక్షను ఉప్పు నీటిలో 15 నిమిషాల సేపు ఉంచిన తర్వాత అందులో నుంచి తీసి మంచి నీటిలో ముంచి కడిగి నీరు కారిపోయే వరకు పక్కన పెట్టాలి.
  • ద్రాక్ష, అల్లం, నిమ్మరసం మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
  • రుచి చూసి అవసరమనిపిస్తే చక్కెర వేసి మరొకసారి గ్రైండ్‌ చేయాలి.
  • ఈ చిక్కటి ద్రవాన్ని ఒక పాత్రలో పోసి మూత పెట్టి ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి.
  • సర్వ్‌ చేసే ముందు తీసి ఫోర్క్‌తో గుచ్చి పలుకులు చేసి గ్లాసుల్లో పోసి పుదీన ఆకులతో గార్నిష్‌ చేయాలి.

ఇవి చదవండి: అరటి పండ్లు పండిపోతున్నాయని పడేస్తున్నారా?

Advertisement
Advertisement