మానసిక ఆరోగ్యం మనకాలపు అవసరం

9 Oct, 2021 01:24 IST|Sakshi

సందర్భం

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌– 19 మహమ్మారి ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల లోనే కాకుండా మానసిక సంక్షోభాన్ని కూడా తెచ్చి పెట్టింది. ముఖ్యంగా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లయిన వైద్య సిబ్బంది, పోలీస్, శానిటేషన్‌ సిబ్బందితో పాటు ఒంటరిగా జీవించేవారిని మరింత కృంగదీసింది.

అభివృద్ధి చెందుతున్న భారత్‌లాంటి దేశాలలో 6–7% ప్రజలు మానసిక వ్యాధులతో సతమతమవు తున్నారు. వారు కోల్పోయే ఆరోగ్యవంతమైన రోజులు మలేరియా, టీబీ, డయేరియా కన్నా ఎక్కువే. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001 రిపోర్టు, ప్రతి నాలుగు కుటుంబాలలో ఒక కుటుంబంలోని సభ్యులు ప్రవ ర్తనా సంబంధిత రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ రుగ్మతలు వీరి విద్య, ఉపాధి మార్గాలను దెబ్బకొట్టడమే కాకుండా, వీరి కుటుంబ సభ్యుల పైన కూడా ప్రభావం చూపుతాయి.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్య పరిరక్షణకు కూడ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దీనికి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఒక సందర్భం చేసుకోవాలి. ఈ 2021 థీమ్‌ను ‘మెంటల్‌ హెల్త్‌ ఇన్‌ ఆన్‌ అన్‌ఈక్వల్‌ వరల్డ్‌’గా ప్రకటించారు. మానసిక ఆరోగ్య సేవలు అందించడంలో ఎలాంటి అసమానతలు ఉండకూడ దని ఈ థీమ్‌ ముఖ్యోద్దేశం. ఎందుకంటే బాధితుల్లో 75–95 శాతం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. వీరంతా వైద్యానికి ఆమడదూరంలో ఉన్నారు. ధనిక దేశాలలోనూ సేవలు ఆశాజనకంగా లేవు. దీనికి కారణం, ‘ఆరోగ్య బడ్జెట్‌’లోని నిధులలో మానసిక ఆరోగ్య సేవలకు కేటాయించేవి అత్యల్పం కావడం.

చాలా కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి, అనేక ఆర్థిక ఇబ్బందులతోపాటు ఆ తరువాత జరిగిన పలు పరిణామాలకు తీవ్ర నైరాశ్యానికి గురయ్యాయి. లాక్‌డౌన్‌లో ఉద్యోగాలు కోల్పోవడం, సామాజిక దూరం పాటిస్తూ ఉండటం, ఇంటి నుండి పనులు చేయడం వలన కూడ కొందరిలో డిసోసియేటివ్, సైకోటిక్, హైపోకాండ్రి యాక్‌ లక్షణాలు కనిపించ డంతో పాటు, ఓసీడీలతో కూడా సతమతవుతున్నారు.

మానసిక వైద్యుడిని సంప్రదించడానికి నిరాసక్తతతో పాటు, మానసిక వ్యాధులను ఒక కళంకంగా భావించడం వలన వ్యాధి తీవ్రత పెరిగి  ఆత్మహత్యా ప్రయత్నాల వరకు వెళ్ళుతున్నారు. కరోనాను అధిగ మించడం కోసం ఎంచుకున్న లాక్‌డౌన్ల వలన ఈ మానసిక రుగ్మతలు కౌమారదశ వారిలో అధికంగా బయటపడుతున్నాయి.

ఈ సవాళ్లను అధిగమించేలా ‘మెంటల్‌ హెల్త్‌ డే’ నాడు లోకల్‌గానూ, గ్లోబల్‌గానూ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. సివిల్‌ సొసైటీలుగా ఏర్పడి, వారి ప్రాంతంలో మానసిక వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి, వారి గురించి అందుబాటులో ఉండే పీహెచ్‌సీ, ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం అందించే విధంగా అవగాహన కలిగించాలి. మొదట సమస్యను గుర్తించి, దాని గురించి బయట చెప్పుకొనే విధంగా ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించాలి.

కేంద్ర ప్రభుత్వం 1982లో ‘నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ మిష న్‌’ను ఏర్పాటు చేసింది. ‘బళ్ళారీ మోడల్‌’ నమూ నాతో ‘డిస్ట్రిక్‌ మెంటల్‌ హెల్త్‌  ప్రోగ్రామ్‌’ ఆవిష్కరించి మొదట నాలుగు జిల్లాలతో మొదలుపెట్టి వంద జిల్లాలలో అమలు చేయడానికి ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా కమ్యూనిటీ స్థాయి నుండి సమాజం పాత్ర ఉండేలాగ, వ్యాధిని ముందుగా గుర్తించడం, వైద్య సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వడం, పరిశోధన, ప్రజావగాహన కార్యక్రమాలు నిర్వహిం చడం చేయాలి. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు సొంతం చేసుకొని మానసిక ఆరోగ్య సేవలను విస్తృతంగా అందుబాటులోకి తేవాలి.


డాక్టర్‌ కడియం కావ్య
వ్యాసకర్త పాథాలజీ విభాగ స్పెషలిస్ట్, వర్ధన్నపేట కడియం ఫౌండేషన్‌ చెయిర్‌ పర్సన్‌
(అక్టోబర్‌ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం)

 

మరిన్ని వార్తలు