Sakshi News home page

డాలర్‌ డౌన్‌ ఫాల్‌!

Published Thu, Apr 6 2023 4:45 AM

US dollar is losing influence as a global currency - Sakshi

దొడ్డ శ్రీనివాసరెడ్డి :  గ్లోబల్‌ కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. డాలర్‌కు వ్యతిరేకంగా సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య పెరిగిపోయింది. ఈ దేశాల జాబితాలో ఇప్పుడు భారత్‌ కూడా చేరింది. ప్రస్తుతం దాదాపు  అన్ని దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అమెరికన్‌ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి.

అంతర్జాతీయ వాణిజ్యం, రుణాలు, సెక్యూరిటీల లావాదేవీల్లో సగానికి పైగా డాలర్లలోనే సాగుతున్నాయి. ఇక విదేశీ కరెన్సీల ఎక్సే్ఛంజ్‌ మార్కెట్‌లలో మొత్తం అన్ని కరెన్సీలను కలుపుకొన్నా 90 శాతం ట్రేడింగ్‌ అమెరికన్‌ డాలర్ల ద్వారానే జరుగుతోంది. ఇక ముందు ఈ పరిస్థితి మారబోతోంది. డాలర్‌పై ఆధారపడటం మాని సొంత కరెన్సీలను బలోపేతం  చేసుకోవాలనే కోరికతో అనేక దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు  చేసుకుంటున్నాయి. సమీప భవిష్యత్‌లోనే గ్లోబల్‌ కరెన్సీ స్థానాన్ని అమెరికన్‌ డాలర్‌ కోల్పోయే ప్రమాదం వచ్చింది.

ఇలా మొదలైంది.. 
బ్రెట్టన్‌వుడ్‌ ఒప్పందంతో అమెరికన్‌ డాలర్‌ పెత్తనం మొదలైంది.రెండో ప్రపంచ యుద్ధకాలంలో కుదేలైన అనేక దేశాలు ముఖ్యంగా యూరప్‌ దేశాలు అనేకానేక ఉత్పత్తుల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది. వాణిజ్య ఒప్పందాల్లో డాలర్‌ విలువ ఎలా ఉండాలనే విషయమై ఐక్యరాజ్యసమితి ద్రవ్య, ఆర్థిక సదస్సు అమెరికా న్యూ హాంప్‌షైర్‌లోని బ్రెట్ట్టన్‌వుడ్‌లో జరిగింది.

44 దేశాలు పాల్గొన్న ఈ సమావేశంలో అంతర్జాతీయంగా బంగారు ధరలను డాలర్‌ విలువకు జతచేస్తూ ఒప్పందం చేసుకున్నా యి. దాంతో ఇతర కరెన్సీల విలువను డాలర్‌ మారక విలువ కోసం ఈ ఒప్పందం ప్రాతిపదికైంది. ఒక డాలర్‌ విలువ ఒక ఔన్స్‌ (31.1034768 గ్రాములు) బంగారంతో సమానమైంది. 1970లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ డాలర్‌ విలువను బంగారు ధరకు జత చేయడాన్ని రద్దు చేసినప్పటికీ అప్పటికే డాలర్‌ నిల్వలు అన్ని దేశాల్లో పెరిగిపోయి గ్లోబల్‌ కరెన్సీగా అవతరించింది.

పనామా, ఎల్‌ సాల్వడార్, జింబాబ్వే లాంటి 11 దేశాలు ఇప్పటికీ అమెరికన్‌ డాలర్‌నే తమ దేశాల్లో అధికారిక కరెన్సీగా చెలామణి చేస్తున్నాయి. డాలర్‌ శక్తిసామర్థ్య ంతో రెచ్చి పోయిన అమెరికా అనేక సందర్భాల్లో ఆ డాలర్‌నే ఆయుధంగా వాడుకుంది. ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వ చేసిన 64,000 కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది.

రష్యా విదేశీ మారక నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంది. ఇలాంటి ప్రయోగమే వివిధ సందర్భాల్లో అఫ్గానిస్తాన్, ఇరాన్, వెనెజులా వంటి దేశా లపై అమెరికా ప్రయోగించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది. 

తొలుత రష్యాలో.. 
క్రిమియా ఆక్రమణ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొనడానికి 2014లో రష్యా చైనాతో చేతులు కలిపి డాలర్‌కు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీంతో గ్లోబల్‌ కరెన్సీగా చెలామణి అవుతున్న అమెరికన్‌ డాలర్‌కు పెద్ద సవాల్‌ మొదలైంది. రష్యా, చైనా మధ్య జరిగే అన్ని వ్యాపార లావాదేవీల్లో మారక ద్రవ్యంగా రూబుల్‌–యువాన్‌లు వినియోగించాలని ఈ రెండు దేశాలు నిర్ణయించా యి.

అంతేకాదు రష్యా తన విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అధికశాతం చైనా యువాన్‌ కరెన్సీని సమకూర్చుకోవాలని కూడా నిర్ణయించింది. దాంతో గత ఏడాదికి రష్యా విదేశీ మారక నిల్వ ల్లో యువాన్‌ 60 శాతానికి పెరిగినట్లు రష్యా ఆర్థిక శాఖ ప్రకటించింది. అలాగే డాలర్‌ స్థానంలో తమ సొంత కరెన్సీల్లోనే వ్యాపారం నిర్వహించాలని ఇటీవల చైనా, బ్రెజిల్‌ నిర్ణయించాయి. లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన బ్రెజిల్‌తో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా డాలర్‌ పెత్తనానికి మరో పెద్ద సవాల్‌ ఏర్పడింది.

బ్రెజిల్‌ రీస్‌ చైనా యువాన్‌ బంధం డాలర్‌ ఆధిపత్యాన్ని నిలువరించింది. గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య 15,000 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. డాలర్, యూరో, యెన్, పౌండ్‌లకు బదులు తమ దేశాల కరెన్సీలతోనే వ్యాపారం సాగించాలనే ఏకైక ఎజెండాతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖలు, ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఇటీవల అధికారిక సమావేశం నిర్వహించాయి. 

70 శాతం నుంచి 59 శాతానికి.. 
గత జనవరిలో దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెది పాండోర్‌ ఒక ఇంటర్వ్యూలో ‘బ్రిక్, (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ మారకాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటున్నాయి’అని వెల్లడించారు. సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్‌ అల్‌–జదాన్‌  ఇటీవల మరో బాంబు పేల్చారు. చమురు వ్యాపారంలో డాలర్‌కు ఇతర కరెన్సీల వినియోగంపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.

అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అంతర్జాతీయంగా చమురు వాణిజ్యం దాదాపుగా అమెరికన్‌ డాలర్లలోనే జరుగుతుంది. అందుకే దాన్ని పెట్రోడాలర్‌గా పిలుస్తారు. చమురు ఎగుమతుల్లో ఒపెక్‌ (చమురు ఉత్పత్తి చేసే దేశాలు) దేశాల్లో అగ్రస్థానంలో 
నిలిచే సౌదీ అరేబియా ఇతర కరెన్సీల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే అమెరికన్‌ డాలర్‌ ఆధిపత్యానికి చరమగీతం పాడినట్లేనని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం.

భారత్‌–రష్యా మధ్య కూడా వాణిజ్యం అమెరికన్‌ డాలర్‌లో కాకుండా ఇతర కరెన్సీల్లో జరుగుతోంది. భారతీయ సంస్థలు రష్యా నుంచి చేసుకున్న దిగుమతులకు అరబ్‌ ఎమిరేట్స్‌ కరెన్సీ దినార్‌ను వినియోగించేవి. ఇప్పుడు రూబుల్‌లో చెల్లింపులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభానికి వివిధ దేశాల విదేశీ మారక నిల్వల్లో అమెరికన్‌ డాలర్‌ వంతు 59 శాతానికి తగ్గిపోయింది. ఇది 1999 నాటికి 70 శాతం ఉండేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. 

ఇక భారత్‌ వంతు.. 
భారత్‌ కూడా తన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశలో చర్యలు మొదలుపెట్టింది. అనేక దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న తరుణంలో డాలర్, యూరో, యెన్, పౌండ్‌లతో దీటుగా రూపాయిని గ్లోబల్‌ కరెన్సీగా చెలామణి చేసేందుకు తొలి అడుగులు వేసింది. రూపాయిని మారక విలువగా వినియోగించేందుకు వీలుగా ఆర్‌బీఐ రష్యా, శ్రీలంకతోపాటు మొత్తం 18 దేశాల్లోని 60 బ్యాంకుల్లో వోస్ట్రో అకౌంట్లను ప్రారంభించింది.

అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి ద్వారా నిర్వహించడానికి వీలుగా ఆర్‌బీఐ ఈ అకౌంట్లను ప్రారంభించిందని భారత ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్‌ కరాడ్‌ ప్రకటించారు. రూపాయితో వ్యాపారం చేయడానికి ఒప్పుకున్న దేశాల్లో బ్రిటన్, మలేషియా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, శ్రీలంక, మయన్మార్, బోట్‌స్వానా, ఇజ్రాయెల్, ఫిజి, ఒమన్, జర్మనీ, కెన్యా, గయానా, మారిషస్, టాంజానియా, ఉగాండా దేశాలున్నాయి. అమెరికా వాల్‌స్ట్రీట్‌లో ‘డాక్టర్‌ డూమ్‌’గా పేరుపడ్డ ఆర్థికవేత్త నౌరియల్‌ రుబిని ‘రానున్న రోజుల్లో భారత రూపాయి అంతర్జాతీయ విపణిలో అతి ముఖ్యమైన విదేశీ మారకద్రవ్యంగా 
అవతరించబోతోంది’ అన్నారు.   

Advertisement

What’s your opinion

Advertisement