Sakshi News home page

యుద్ధంలో ఉన్నాం.. కలసి పోరాడాల్సిందే!

Published Fri, Jul 7 2023 4:01 AM

BJP Leader Kishan Reddy Interview With Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడు యుద్ధంలో ఉన్నామని.. క్రమశిక్షణ కలిగిన సైనికులుగా అంతా కలసి పోరాడాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. జాతీయ పార్టీ ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ.. వచ్చే ఎన్నికల్లో విజయసాధనే లక్ష్యంగా ముందుకు వెళతామని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీలో పూర్తిస్థాయిలో సమన్వయం సాధిస్తామని.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటామని చెప్పారు. పార్టీని ఎవరూ వీడబోరని.. పార్టీలోకి చేరికలు, అభ్యర్థుల ఎంపికపై త్వరలో కసరత్తు చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక కిషన్‌రెడ్డి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

ప్రత్యామ్నాయం బీజేపీనే.. 
‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో గట్టిగా పోరాడుతాం. అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే నమ్మకం ప్రజల్లో కలిగించేలా కచ్చితమైన కార్యాచరణతో ముందుకెళతాం. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. 

ఎన్నికల మోడ్‌లోకి వెళతాం 
ఈ నెల 10న ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం ఉంది. ప్రధాని మోదీని కలుస్తాను. రాష్ట్ర పార్టీలోని నేతలందరితో సమావేశమై ఎన్నికల మోడ్‌లోకి వెళతాం. ఇక్కడి నాయకులతో భేటీలు నిర్వహించి, అన్ని అంశాలపై సమన్వయం చేసుకుని ముందుకెళతాం. ఆషాఢ మాసం కాబట్టి ఇప్పుడే అధ్యక్ష స్ధానంలో కూర్చోను. అయితే అధ్యక్ష బాధ్యతలన్నీ చూసుకుంటాను. 

ఒక్కరోజులోనే పరిస్థితులు మారిపోవచ్చు! 
అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం సమస్య అని నేను అనుకోవడం లేదు. వేగంగా మారుతున్న సమాజ అభిప్రాయాలు, అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన సందర్భంలో ఒక్క రోజులోనే పరిస్థితులు మారిపోతాయి. ఒక్కరోజులోనే అనుకూల వాతావరణం ఏర్పడవచ్చు. కేసీఆర్‌ నేతృత్వంలో తొమ్మిదేళ్లకుపైగా నిరంకుశ పాలనను చవిచూసిన ప్రజలు ఈసారి ఆయనను తిరస్కరించడం ఖాయం. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌పై విశ్వాసం, నమ్మకం కుదిరే పరిస్థితులు లేవు, రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. 

బీజేపీలోకి చేరికలను వేగవంతం చేస్తాం 
ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికల ప్రక్రియను ఇకపై వేగవంతం చేస్తాం. ఎన్నికల్లో పోటీకి అర్హులైన అభ్యర్థులను తేల్చే కసరత్తును వెంటనే మొదలుపెడతాం. ఏ నియోజకవర్గంలో పార్టీలో ఉన్న వారిలో ఎవరెవరు మంచి అభ్యర్థి అవుతారనేది పరిశీలిస్తాం. ఆ దిశగా ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తాం. 

కేసీఆర్‌ తీరును ఎండగడుతూనే ఉన్నాం.. 
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలి సభలో బీఆర్‌ఎస్‌ను రాక్షస సమితి అని, కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఆయన కుమార్తెకే మేలు జరుగుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు. అమిత్‌షా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కేసీఆర్‌ సర్కార్‌ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనను ఎండగడుతూనే ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును, కేసీఆర్‌ వ్యవహారశైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అనడానికి ఇంతకంటే ఏం కావాలి? 

ప్రజల్లోనే ఉంటూ పోరాడుతాం 
కేసీఆర్‌ సర్కారు పూర్తిగా అవినీతిమయమైంది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజీలేని పోరాటం చేస్తాం. పార్టీ కార్యకర్తలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. నేతలంతా ప్రజలు, కార్యకర్తల మధ్యే ఉంటూ విశ్వాసం కలిగించేలా చూస్తాం. పార్టీని విజయపథంలోకి నడిపించడంలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించబోతున్నారు..’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. 
 
పార్టీని ఎవరూ వీడరు.. సమన్వయం సాధిస్తాం.. 
ఏ నాయకుడు కూడా బీజేపీని విడిచి వెళతారని భావించడం లేదు. అందరినీ కలుపుకొని పోతాం. పార్టీలో అసంతృప్తి అనే మాటే లేకుండా, సర్దుకునిపోయేలా సమన్వయం చేయడంపై ప్రధానంగా దృష్టి పెడతాం. కొత్త, పాత నేతలు, జూనియర్, సీనియర్‌ అనే తారతమ్యాలు లేకుండా నాయకుల మధ్య ఐక్యతను సాధిస్తాం. టీమ్‌ వర్క్‌తో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక, ఎన్నికల వ్యూహాలను సమష్టిగా రూపొందించుకుంటాం.   

Advertisement

What’s your opinion

Advertisement